కేసీఆర్ (KCR) పాలనను అంతం చేయాలని ప్రజలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. మీ కోసం కొట్లాడిన బీజేపీని గెలిపించండన్నారు. కేసీఆర్ అరాచక పాలన ఎలావుంటుందో, మీరు పడిన గోస ఎలాంటిదో గుర్తుకు తెచ్చుకోండన్నారు. అంబలి, అన్నదానం చేస్తే చేసిన కేసీఆర్ చేసిన పాపాలు పోతాయ అని ఆయన ప్రశ్నించారు.
సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ పాల్వాయి హరీశ్ రావు ఈ రోజు నామినేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. పొరపాటున మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే 3 నెలల కోసారి జీతాలు వస్తాయన్నారు. బదిలీలు ప్రమోషన్లు ప్రమోషన్లు రావని గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణలో తొలి ఓటరు ఉన్న నియోజకవ వర్గం సిర్ఫూర్ కాగజ్ నగర్ అన్నారు. బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడ నుంచే అని ధీమా వ్యక్తం చేశారు. కోనప్పా.. ఇక చాలప్ప… ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సొంత ఎజెండాను అమలు చేస్తూ కాంట్రాక్టు లు ఆయన సొంత మనుషులకే ఇస్తున్నాడంటూ మండిపడ్డారు.
కోనప్పా అతని సోదరులు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని, దీంతో పాటు బియ్యం దందాతో పాటు మట్కా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ నియోజక వర్గంలో ఎంతో మంది రైతులున్నారని అన్నారు. కానీ కనీసం వంద ఎకరాలకైనా సాగునీరిచ్చాడా? అని ప్రశ్నించారు. నియోజక వర్గానికి సాగు నీరు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. నదులకు నడక నేర్పిన ఇంజనీర్ కేసీఆర్‌కు కాగజ్ నగర్ రైతులు కనబడతలేదా? అని నిలదీశారు.
సిర్పూర్‌ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని కేసీఆర్ ను నిలదీసే దమ్ము కోనప్పకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడి జైలుకు పోయిన చరిత్ర పాల్వాయి హరీశ్ కు ఉందని గుర్తు చేశారు. కరోనాతో బాధపడుతున్నానని చెప్పినా వినకుండా హరీశ్ ను గుంజుకు పోయి జైల్లో వేయించిన నీచుడు కోనప్ప అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.