ఈమధ్యే రాష్ట్ర బీజేపీలో అధిష్టానం భారీ మార్పులు చేసింది. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. అలాగే, ఈటల రాజేందర్ కు పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీని చైర్మన్ ని చేసింది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఇవి జరిగాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు బండి సంజయ్. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించి దేశ రాజకీయాల్లో క్రియాశీలకం చేసింది హైకమాండ్.
తాజాగా ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి పదవీ బాధ్యతలు తీసుకున్నారు సంజయ్. ఈ సందర్భంగా నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అధిష్ఠానం తనపై పెట్టిన బాధ్యతను నమ్మకంతో పనిచేసి.. పార్టీని శక్తివంతంగా తయారు చేస్తానని ఆయన వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేసి.. మోడీ రాజ్యస్థాపనకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు బండి. మోడీ నేతృత్వంలో తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఎంతగానో శ్రమించారని ఆయనను పీఎం అభినందించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింతగా కష్టపడాలని సూచించారు.