తెలంగాణలో బీజేపీ(BJP) ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్(BJP) అన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతులకు చేసే ఆర్థిక సాయం రూ.10 వేలు మాత్రమేనని బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.24వేలు అందిస్తామని చెప్పారు.
ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని బండి సంజయ్ ఆరోపించారు. కానీ తనపై ఉన్న కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనది ప్రజల పక్షాన పోరాటాల చరిత్ర.. ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే.. అవన్నీ ప్రజలకు రాసిస్తానని చెప్పారు.
కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల అని మండిపడ్డారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులది భూకబ్జాల చరిత్ర అని చెప్పారు.
రైతుపక్షపాతి ఎవరో రైతులు ఒకసారి ఆలోచించాలని సూచించారు. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుదని.. కాబట్టి తమకు ఓటేయాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు.