తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆగడాలను ప్రజల ముందు ఎండగట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) పావులు కదుపుతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గం జూబ్లీనగర్, ఫకీర్ పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ (Bandi Sanjay) అధికార పార్టీ పై ధ్వజమెత్తారు.. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ (KCR)కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కబ్జాల కోసం వాళ్ళ ఆరాటం..పేదల కోసం తన పోరాటం.. మీరు ఎటువైపు ఉంటారో తేల్చుకోండని కరీంనగర్ ప్రజలకు వెల్లడించారు బండి సంజయ్..
మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar)ను టార్గెట్ చేసిన బండి సంజయ్.. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల, పురమళ్ల నెంబర్ వన్ అని ఆరోపించారు. రూ.1300 కోట్లను బియ్యం టెండర్లలో గోల్ మాల్ చేసిన గంగుల అవినీతిలో ఆరితేరారని విమర్శించారు.. నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికో ఉద్యోగం ఏమైంది? అని ప్రశ్నించిన బండి సంజయ్.. కేసీఆర్ తన ఇంట్లో 5 గురికి పదవులు ఇచ్చుకుని నిరుద్యోగ బతుకులు ఆగం చేశారని మండిపడ్డారు.
మరోవైపు బండి సంజయ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్.. బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలే అని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఖైదీ సంజయ్ డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు తన వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు గంగుల కమలాకర్.. ప్రస్తుతం వీళ్ళ మధ్య జరుగుతున్న వార్.. కరీంనగర్ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారిందని అనుకుంటున్నారు..