ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేష్(Bandla Ganesh)కు బిగ్‌షాక్ తగిలింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఒంగోలు కోర్టు(Ongole Court) ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95లక్షల జరిమానా విధించింది. కోర్టు ఖర్చులు సైతం చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది.
2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ.95లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి రూ.95లక్షల చెక్ ఇచ్చారు బండ్ల గణేశ్. అయితే ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలోనూ ఎర్రమంజిల్ కోర్టు బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో రూ.25లక్షల చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బండ్ల గణేష్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు.