సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ(Malkajigiri MP) స్థానం నుంచి పోటీ చేయటానికి దరఖాస్తు చేసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటానికి అవకాశం కల్పించాలంటూ తన దరఖాస్తును గాంధీభవన్(Gandhi Bhavan)లో ఇవాళ(ఫిబ్రవరి 2) సమర్పించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నా. మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇస్తే.. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకిలోకి వస్తానన్నా, తీసుకునే వారు లేరు, ఆయన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వదు’’ అంటూ చెప్పుకొచ్చారు.
రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, రాబోయే ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మతి భ్రమించి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. మినీ ఇండియా పేరొందిన మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందోనని తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.