అధ్యక్షా.. అంటూ అసెంబ్లీలో మాట్లాడాలనేది సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కోరిక. కానీ, ఆయన అనుకున్నదేదీ వర్కవుట్ కాలేదు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) లో చేరారు. షాద్ నగర్ (Shadnagar) సీటు ఆశించారు. కానీ, అవకాశం దక్కలేదు. కొన్నాళ్లు పార్టీలో కొనసాగారు. తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.. తనకు పాలిటిక్స్ సెట్ అవ్వవనే క్లారిటీ వచ్చేసిందని మాట్లాడారు. కానీ, ఆయన మనసు మార్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కూకట్ పల్లి (Kukatpalli) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బండ్ల గణేష్ పోటీకి దిగుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కూకట్ పల్లిలో సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉంటారు. పైగా, బండ్ల గణేష్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్.. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ మాట్లాడారని తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.
ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టిన బండ్ల గణేష్.. ‘‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ.. నాకు టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం. జై కాంగ్రెస్’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ తో బండ్ల గణేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే క్లారిటీ వచ్చేసింది. మరోవైపు, స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 నుంచి 80 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.