బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకా (Dhaka)లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)లో 44 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.. ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో.. స్థానికుల నుంచి సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు..
ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్లో ఉన్న సుమారుగా మరో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు తెలుస్తోంది. కాగా రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. ప్రమాద ఘటన గురించి అగ్నిమాపక శాఖ అధికారి మహ్మద్ షిహాబ్ మాట్లాడుతూ..
ఢాకాలోని 7 అంతస్తుల రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాం.. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది వేగంగా మంటలు ఆర్పారని తెలిపారు. వేసవి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని, అందువల్ల 44 మంది అప్పటికే దుర్మరణం చెందినట్లు వివరించారు. ప్రమాదంలో చిక్కుకొన్న 75 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు..
మరోవైపు భవనంలోని దాదాపు అన్ని అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు వస్త్ర దుకాణాలు, మొబైల్ షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.. ఇదిలా ఉండగా అగ్నిప్రమాదంపై బంగ్లా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంఘటనకు గల కారణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది.