బాన్సువాడ(Bansuwada) బీజేపీ అభ్యర్థి(Bjp Candidate) క్యాంప్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాన్సువాడ పట్టణంలోని బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ(Yendala Laxminarayana) రాత్రి తన క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తుండగా నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న డ్రైవర్లను దుర్భాషలాడుతూ దాడికి దిగారు.
దాడి సమయంలో పై పోర్షన్‌లో ఉన్న యెండల లక్ష్మీనారాయణకు విషయాన్ని గ్రహించి స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, గన్‌మన్‌లు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆరా తీశారు.
అప్పటికే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వెళ్లిపోయారు. దాడికి సంబంధించి సీఐతో లక్ష్మినారాయణ వాగ్వాదం చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారని బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆరోపించారు.
సీఐతో వాగ్వాదానికి దిగారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగానే తనపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పోచారం కుటుంబం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.