విద్యార్థులను తీర్చి దిద్దవలసిన విశ్వవిద్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవలసిన యువత మత్తుకు బానిసై అందమైన భవిష్యత్తును అంధకారంగా మార్చుకొంటున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తున్నాయి.. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలు వర్షంలో కన్నీటి బిందువుల్లా మారుతున్నాయి..
ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తారని అనుకొంటున్న పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి.. దేనికి పనికిరాకుండా పోతున్న దృశ్యాలు వార్తల్లో కనిపిస్తున్నవి.. ఇక ఈ విషయంలో చట్టం సైతం కఠినంగా వ్యవహరిస్తున్నా.. జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనల వల్ల కొత్త కొత్త దారుల్లో మాదక ద్రవ్యాల సరాఫరా జరుగుతుంది.
ఇందుకు స్మగ్లర్ల టార్గెట్ యువతగా మారింది. ఇక ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT).. మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా బాసర క్యాంపస్‌లో గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సిబ్బందికి పట్టుబడటం కలకలంగా మారింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులను అదుపులోకి తీసుకొన్నారు.
మరోవైపు క్యాంపస్‌లోని బాయ్స్ హాస్టల్ (Boys Hostel) బిల్డింగ్‌పై గంజాయి (Ganja) ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి మహారాష్ట్ర (Maharashtra) నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇక పటిష్ట భద్రత ఉండే క్యాంపస్‌లోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ తరచుగా జరుగుతుండటం క్యాంపస్ లో చదువుతున్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.