భట్కేశ్వర్ దత్ (Batukeshwar Dutt)…..భగత్‌సింగ్ (Bhagat Singh)తో కలిసి కేంద్ర శాసన సభపై బాంబు విసిరిన విప్లవ వీరుడు. జైళ్లో ఉంటూనే మానవ హక్కుల రక్షణ కోసం పోరాడిన గొప్ప నేత. ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ భగత్ సింగ్‌తో కలిసి 114 రోజుల నిరాహార దీక్ష చేసిన గొప్ప పోరాట యోధుడు. ఓ వైపు టీబీతో బాధపడుతూనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర్య సమరయోధుడు.
18 నవంబర్ 1910న బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఖండఘోష్ గ్రామంలో జన్మించారు. థియోసాఫికల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. కాన్పూర్‌లోని పృథ్వీనాథ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. కాలేజీ రోజుల్లో భగత్ సింగ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. భగత్ సింగ్ నుంచి ప్రేరణ పొంది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరాడు.
అప్పటి నుంచి విప్లవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 8 ఏప్రిల్ 1929న భగత్ సింగ్‌తో కేంద్ర శాసన సభపై బాంబుదాడి చేశాడు. అనంతరం వారిద్దరినీ బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. అక్కడ జైలులో ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భగత్ సింగ్‌తో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన్ని అండమాన్ జైలుకు పంపించారు. జైళ్లో ఉండగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు.
ఈ క్రమంలో ఆయన్ని పాట్నా జైలుకు తరలించారు. 1938లో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. టీబీ వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉన్నా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. దీంతో ఆయన్ని అరెస్టు చేసి నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు. స్వతంత్ర్య అనంతరం ఆయన విడుదలయ్యారు. 1965లో అనారోగ్యంతో ఆయన మరణించారు.