ప్రయాణికులకు భారత రైల్వే (Indian Railway) గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ కంపార్ట్ మెంట్లలో ఆర్ఏసీ (RAC) ప్రయాణికులకు స్పెషల్ బెడ్ రోల్ అందించాలని నిర్ణయించింది. కిట్‌లో ఒక దుప్పటి, బెడ్ షీట్, టవల్, ఒక తలగడను అందించనున్నారు, ఈ బెడ్ రోల్ కిట్ కు సంబంధించిన ఛార్జీలను బుకింగ్ సమయంలోనే ప్రయాణికులు చెల్లిస్తారని పేర్కొంది.
రైల్వే బోర్డు నిర్ణయాన్ని ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింత్ వెల్లడించారు. ఈ సదుపాయం చైర్ కార్ ప్రయాణికులకు వర్తించదని స్పష్టం చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖ రాసినట్టు వెల్లడించారు. ఈ సదుపాయం ఆర్ఏసీ ప్రయాణికులకు అందేలా చూడాలని ఆదేశించామన్నారు.
ఏసీ క్లాస్‌లో ఇతర ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా, వారిని కూడా కన్ఫార్మ్ టికెట్ పొందిన ప్యాసింజర్లతో సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్నీ తీసుకున్నామని వివరించారు. ఈ బెడ్ రోల్స్ ధరలను నామమాత్రంగానే వసూలు చేస్తున్నామని చెప్పారు. అది కూడా టికెట్ రుసుము రూపంలోనే వసూలు చేస్తున్నామని వెల్లడించారు.
ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సలేషన్ అని అర్థం. సాధారణంగా ఎవరైనా ఒక ప్రయాణికుడు కన్ఫార్మ్ టికెట్ ను రద్దు చేసుకున్న సమయంలో ఆ బెర్తులను ఆర్ఏసీ కింద మరో వ్యక్తికి కేటాయిస్తారు. అలా కుదరని సందర్బంలో ఆర్ఏసీ కింద ఒక బెర్త్ ను ఇద్దరు ప్రయాణికులకు కలిపి రైల్వే కేటాయిస్తుంది. సాధారణంగా సైడ్ లోయర్ బెర్త్ ను ఇలా ఇద్దరికి కలిపి ఎక్కువగా కేటాయిస్తూ వుంటారు.