విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి సాధించుకున్నది తెలంగాణ (Telangana). ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతీ ఒక్కరూ పోరుబాట పట్టి అనుకున్న లక్ష్యం చేరుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వచ్చింది. రెండు పర్యాయాల నుంచి రాష్ట్రాన్ని ఏలుతోంది. అయితే.. ఇన్నేళ్లలో ఎన్నో అక్రమాలు వెలుగుచూశాయి. గులాబీ నేతలపై విపరీతమైన కబ్జా ఆరోపణలు వచ్చాయి.
ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడంతో ప్రైవేట్ భూములే కాకుండా ప్రభుత్వ భూములు (Lands) సైతం అన్యాక్రాంతం అయ్యాయి. చాలావరకు వీటి వెనుక గులాబీ నేతల హస్తం ఉందనే విమర్శలు ప్రతిపక్షాల సైడ్ నుంచి వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అకేనిపల్లె (Akenipalle) గ్రామంలోని అటవీ భూముల వ్యవహారంపై చిత్రగుప్త్ ఛానల్ ఓ కథనాన్ని ఇచ్చింది. మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి మండలంలో ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడి భూముల వ్యవహారం హైకోర్టు వరకు చేరింది.
2 వేల ఎకరాలు మిస్ అయ్యాయని ఓ వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు సమాధానం ఇస్తూ.. అవి ఎక్కడికీ పోలేదని చెప్పారు. ధరణి పోర్టల్ లో కూడా చూపిస్తున్నాయని అన్నారు. అయితే.. హైకోర్టులో ఇదే అంశంపై రిట్ పిటిషన్ నడుస్తుండగా.. సర్వే నెంబర్ 100లో 3,944 ఎకరాలు ఉందని చెప్పారు. కానీ, అందులోనే ఇదే సర్వే నెంబర్ లో 4,174 ఎకరాలు, అలాగే, 34 సర్వే నెంబర్ లో 5,821 ఎకరాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అంటే, మొత్తం 9,995 ఎకరాలు అన్నమాట.
రాష్ట్ర అటవీశాఖ NRSC భువన తెలంగాణ పోర్టల్ లో అకేనిపల్లెలో ఉన్న భూమిని కొలత చేస్తే.. 9.46 స్క్వేర్ కిలో మీటర్లు వస్తోంది. దాన్ని ఎకరాలుగా లెక్కగడితే 2,307 ఎకరాలు మాత్రమే వచ్చింది. మరి, ప్రభుత్వం చెప్పిన 9,995 ఎకరాల సంగతేంటనేది మేధావుల ప్రశ్న. అన్ని వేల ఎకరాలు చూపించి.. కేంద్రం నుంచి కాంపా ఫండ్స్ తీసుకుంటున్న సర్కార్.. వాటిని ఎటువైపు మళ్లిస్తోంది? ఎవరి జేబులోకి పంపుతోందని ప్రశ్నిస్తున్నారు. సర్కారు లెక్కల్లోనే ఇంత తేడా ఉంటే ఎలా అని నిలదీస్తున్నారు.