కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో (Bengaluru CEO) సుచనా సేథ్ (Suchana Seth) తన కన్న కొడుకునే హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై గోవా పోలీసులు(Goa Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. సుచనా ఓ టిష్యూ పేపర్‌పై లేఖ రాసి బాలుడి మృతదేహం పక్కన పెట్టినట్లు గోవా పోలీసులు తాజాగా గుర్తించారు.
ఐలైనర్ (eyeliner) వాడి బాలుడి కస్టడీ అంశాన్ని టిష్యూ పేపర్ ( tissue paper)పై రాసింది. ఏం జరిగినా సరే కుమారుడు తన వద్దే ఉండాలని పేర్కొంది. కోర్టు విడాకులు మంజూరు చేసినా.. కస్టడీ హక్కు మాత్రం తనకే దక్కాలని అందులో రాసినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.
కాగా, సుచనాకు వెంకట రామన్‌తో 2010లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో విడాకులకు దరఖాస్తు చేశారు. 2022 నుంచి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కుమారుడు ఎవరి వద్ద ఉండాలనే దానిపై వాదలను జరగ్గా.. తల్లి వద్ద ఉండేందుకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అయితే, ప్రతీ ఆదివారం బాబుతో ఉండేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలు సుచనాను తీవ్ర నిరాశకు గురైంది. బాలుడు తండ్రితో ఉండేందుకు తీర్పునివ్వడం ఆమెకు నచ్చలేదు. భర్తతో ఉన్న విభేదాలు, కోర్టు ఆదేశాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆమె చివరికి కన్న కొడుకునే పొట్టనపెట్టుకుంది. పనాజీలోని స్టే అపార్ట్మెంట్లో బస చేసిన సుచనా ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఉన్నట్టుండి బసచేసిన గదిని ఖాళీ చేసి వెళ్లగా ఆ గదిలో సిబ్బంది రక్తపు మరకలను గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీసీ కెమెరాల ద్వారా ఆమె వెళ్లిన క్యాబ్ డ్రైవర్‌ను ఆరా తీశారు. క్యాబ్ అప్పటికే కర్ణాటకలోకి ప్రవేశించడంతో పోలీసుల సూచన మేరకు డ్రైవర్ ఆ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు సుచనా సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా అందులో కుమారుడి మృతదేహం కనిపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.