సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) తన కుమారున్ని హత్య చేసిన కేసులో పోలీసు ( Police)లు కీలక ఆధారాలు సేకరించారు. బాలుని హత్యకు సుచనా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాలుని హత్య జరిగిన గదిలో పోలీసులు రెండు దగ్గు మందు సీసాల (Cough syrups)ను స్వాధీనం చేసుకున్నారు.
చాలా వరకు దగ్గు మందులు నిద్రను కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటాయని పోలీసులు తెలిపారు. అధిక డోసులో దగ్గు మందును బాలునికి సుచనా పట్టించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత బట్ట లేదా మెత్తతో పిల్లవాడిని చంపి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక మోతాదులో దగ్గు మందును పట్టించి ఉండటంతో ఆ బాలుడు గాఢ నిద్రలోకి జారుకుని ఉంటాడని అంటున్నారు.
అందువల్ల మెత్తతో నొక్కి చంపుతున్న సమయంలో పిల్లవాడు కేకలు పెట్టలేకపోయాడని అంచనాకు వచ్చారు. మరోవైపు పోస్టుమార్టమ్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పిల్లవాడిని బట్ట లేదా మెత్తతో నొక్కి చంపి ఉంటారని పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది. ఎక్కడ కూడా చేతి మరకలు లేనట్టు వైద్యులు వెల్లడించారు.
గోవాలో మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేండ్ల కుమారున్ని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ బాలుని మృత దేహాన్ని ఓ సూట్ కేసులో పెట్టారు. ఆ తర్వాత ఓ క్యాబ్‌లో సూట్ కేసుతో గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించారు. ట్యాక్సి డ్రైవర్ సాయంతో పోలీసులు సుచనాను పట్టుకున్నారు. చిత్రదుర్గంలో ఆమెను అరెస్టు చేసి పోలీసులు గోవాకు తీసుకు వచ్చారు.
తన కొడుకును తాను హత్య చేయలేదని సుచనా చెబుతోంది. తాను నిద్ర లేవగానే తన కుమారుడు మరణించి ఉన్నాడని చెప్పింది. సుచనా మాటలను తాము నమ్మడం లేదని పోలీసులు చెబుతున్నారు. చిన్న దగ్గు మందు బాటిల్ కావాలని అపార్ట్ మెంట్ సిబ్బందిని సుచనా కోరారని, ఆ తర్వాత పెద్ద దగ్గు మందు బాటల్ తీసుకుని వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.