నేడు సీతారాముల కల్యాణ మహోత్సవం ఘట్టాన్ని చూసిన వారి మనస్సు అంతా రామమయం.. జగమంతా రామమయం.. అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.. ఇందుకు వేదికగా ముస్తాబైన భద్రాద్రి (Bhadradri) మిథిలా స్టేడియం (Mithila Stadium) వైకుంఠాన్ని తలపించింది.. ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళ శోభితమైన కళ్యాణ మండపంలో ఒకవైపు రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుండగా.. మరోవైపు భక్తుల స్వరం నుంచి శ్రీరామ జయజయ రామ అనే స్తోత్రాలు మంగళ వాయిద్యాలై మారుమోగాయి..
జగదభిరాముడైన శ్రీ సీతారామ చంద్రమూర్తుల కల్యాణంను కనులారా తిలకించిన భక్తజనకోటి పులకించింది. వేద పండితుల మంత్రోచ్చారణలు…కల్యాణ తంతును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు.. రామరాజ్యాన్ని తలపించాయి.. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చారు..
శ్రీరాముని కల్యాణం చూడటమే మహద్భాగ్యంగా భావించే భక్తులతో భద్రాచలం జనసంద్రంగా మారింది. ఈ వివాహా కార్యక్రమంలో భాగంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు. మరోవైపు తెలంగాణ (Telangana) ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం దేవస్థానం స్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాశస్థ్యంను మండపంలోని భక్తులకు వివరించారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలను అర్చకస్వాములు భక్తులకు చూపించి సరిగ్గా 12.06 నిమిషాలకు మాంగల్యధారణ గావించారు.
అనంతరం నూతన వధూవరులకు ఆండాళ్లమ్మ, శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయంగా పండితులు బంతులాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల కార్యక్రమాన్ని 12.15కి కన్నుల పండువగా నిర్వహించి అష్టోత్తర హారతి స్వామి వారికి సమర్పించి అర్చకులు కల్యాణ తంతును ముగించారు. ఇక రామయ్య కళ్యాణం దేవానత జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగింది.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా, అదే వేదికపై గురువారం స్వామి వారికి మహా పట్టాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు వేద పండితులు వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు..