హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం (Sriramacharndra swami Temple)లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డోలోత్సవం, వసంతోత్సవo అత్యంత వైభవంగా నిర్వహించారు.
స్వామివారికి డోలోత్సవం, వసంతో త్సవం నిర్వహించిన రోజు భద్రాద్రి రామయ్యను పెళ్లికుమారుడిని చేసినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని నిలిపివేశారు. మిథిలా స్టేడియం వద్ద కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను కనుల పండువగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా గోదావరి నుంచి బిందెను తీసుకొచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తికి సహస్రధారతో ప్రత్యేక స్నాపనం చేశారు. అనంతరం స్వామివారిని ఉయ్యాల్లో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన గాయకులు రామదాసు, తూము నర సింహదాసు కీర్తనలను ఆలపించారు.
అదేవిధంగా నక్షత్ర, కుంభహారతిని స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా ముందుగా ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులకు, ఆంజనేయస్వామికి, లక్ష్మీ, తాయారు అమ్మవారికి శాస్త్రోక్తంగా వసంతం చల్లారు. అనంతరం వసంతోత్సవ కార్యక్రమానికి చిహ్నంగా భక్తులపై పసుపు నీళ్లను చల్లారు.