టీటీడీ(TTD) ఖజానాపై సీఎం జగన్ కన్ను పడిందని ఏపీ బీజేపీ(AP BJP) అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమని తెలిపిన ఆయన వైసీపీ ప్రభుత్వం టీటీడీ నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి అని, భక్తుల కానుకలతో నడిచే ఏకైక దేవస్థానం టీటీడీ అని భాను ప్రకాశ్ తెలిపారు. రూపాయి కూడా ప్రభుత్వం నుంచి టీటీడీ ఖజానాకు రాదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని.. అందుకే జగన్మోహన్ రెడ్డికి టీటీడీ ఖజానాపై కన్ను పడిందన్నారు.
టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని సూచించారు. శ్రీవారి భక్తులతో కలిసి అనేక ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో శానిటేషన్ పేరిట రూ.100కోట్లు టీటీడీ నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీ నిధులు వినియోగిస్తున్నారని తెలిపారు.
చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తిరుపతికి టీడీపీ నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత మూడు నెలల్లో రూ.200కోట్ల పైన నిధులను ఖర్చు చేశారన్నారు. సీఎం జగన్కు ఇవన్నీ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇది సీఎంకు ఏమాత్రం మంచిది కాదంటూ సున్నితంగా హెచ్చరించారు.