తిరుమలలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (BJP Leader Bhanuprakash Reddy) తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharmareddy) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘ధైర్యం ఉంటే తిరుమలలోని పార్వేట మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగా లేదని చెప్పగలరా..?’ అంటూ విసిరిన సవాల్‌కు భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు.
తేదీ.. సమయం చెబితే.. అర్కాలజీ అధికారులతో కలిసి పార్వేటి మండపం పరిశీలనకు వస్తానని భాను ప్రకాష్‌రెడ్డి అన్నారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను టీటీడీ (TTD) కూల్చివేయొద్దని హితవుపలికారు. టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదన్నారు. పురాతన మండపాలను జీర్ణోద్దారణ చేసే సమయంలో టీటీడీ అర్కాలజీ అధికారులను సంప్రదించాలన్నారు. ఆర్కాలజీ అధికారుల సూచనలు మేరకు టీటీడీ జీర్ణోద్ధారణ పనులు చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. శిథిలావస్థకు చేరుకున్న పురాతన మండపంపై భాను ప్రకాష్‌రెడ్డి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని టీటీడీ ఈవో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో పాల్గొని భక్తుల ప్రశ్నలకు సమాధానలు ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భానుప్రకాష్ రెడ్డిపై సవాల్ విసిరారు.
భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు చేశామని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో అడ్డుచెప్పని భానుప్రకాష్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మండపాల జీర్ణోర్ధరణ పనులకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. భానుప్రకాష్‌రెడ్డికి ధైర్యం ఉంటే పర్వేటి మండపం వద్దకు వచ్చి మండపాన్ని పరిశీలించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు.