అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే విషయమై పరిశీలిస్తున్నట్లు టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి(Dharmareddy) చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. తాజాగా ఆయన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీటీడీ ఈవోపై అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించడానికి ఈవో నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. అన్యమతస్థుల సేవలను వినియోగించుకుంటామని ధర్మారెడ్డి ఏ హోదాలో ప్రకటిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు.
టీటీడీ ఈవో అయితే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా? అని భానుప్రకాష్ రెడ్డి నిలదీశారు. ఇప్పటికే టీటీడీలో అనేక మంది అన్యమతస్థులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. స్వామి వారికి మొక్కని వారు టీటీడీలో విధులు నిర్వర్తిస్తూ జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
అన్యమతస్థుల సేవలు టీటీడీకి అవసరం లేదన్నారు. ధర్మారెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.