సీఎం (CM) కేసీఆర్ (KCR) నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు.. అసలు అభివృద్థి మాటల వరకే పరిమితం అయ్యిందని.. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు అవినీతితో నింపేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం (Election-Campaign) నిర్వహించిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలకులు పందికొక్కుల్లా దోపిడీ చేసి తిన్నటువంటి సొమ్మును కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే కక్కిస్తామని, దోపిడి అరకడతామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద ప్రజలకి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని.. దొరల తెలంగాణను తరిమికొట్టి ప్రజల తెలంగాణ తెచ్చుకుందామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెల్లపాలెం నుంచి జమలాపురం వరకు రోడ్డు వేయిస్తామని భట్టి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుని ప్రజల సమస్యలు మరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి చెప్పుకుంటూ తిరిగే బీఆర్ఎస్ పాలకులను తరిమికొట్టే సమయం ఇదే అని భట్టి పేర్కొన్నారు.