తెలంగాణలో కాంగ్రెస్ ( Congress) అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మరోసారి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti Vikramarkha) పునరుద్ఘాటించారు. దీనిపై పార్టీ తరఫునే కాకుండా భట్టి విక్రమార్క వ్యక్తిగతంగా ఓటర్లు హామీ ఇస్తున్నారు. ఈ మేరకు మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం చొప్పకట్ల పాలెం ఆలయంలో 100 స్టాంపు పేపర్లపై సంతకం చేశారు.
ఎన్నికల్లో విజయం అనంతరం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, దానికి తాను వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నట్టు వెల్లడించారు. తాను గెలిచాక నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిగా అంకితమవుతానని ఈ సందర్బంగా వెల్లడించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రమాణం చేశారు.
దేవుని సమక్షంలో బాండ్ పేపర్లపై ఆయన సంతకం చేశారు. భట్టి విక్రమార్క అనే తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తానని ఈ సందర్బంగా బాండ్ పై రాసి ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందేలా చూస్తానన్నారు. అంతే కాకుండా అనునిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. తన హామీలన్నింటినీ అఫిడవిట్ రూపంలో హామీ ఇస్తున్నానన్నారు. దీంతో ఆయన అఫిడవిట్ ఇప్పుడు సంచలనంగా మారింది.