టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.. చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే, ఇక్కడ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకొంది. ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించగా.. అందులో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు గత ఎన్నికల్లో భీమవరం (Bhimavaram) నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా మరోసారి జనసేనాని అక్కడి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించి స్థానిక నేతలతో సైతం భేటీ అయ్యారు. దీంతో పవన్ మరోసారి భీమవరం నుంచి బరిలోకి దిగడం ఖాయమని అంతా భావించారు.
ఈ నేపథ్యంలో నేడు ప్రకటించిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పోటీపై ఇంకా స్పష్టమైన అవగాహనకి పవన్ రాకపోవడంతోనే లిస్ట్‌లో ఆయన పేరు చేర్చలేరనే టాక్ వినిపిస్తోంది. ఈ దశలో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. జనసేనాని భీమవరం నుంచి కాకుండా మరేదైనా స్థానం నుంచి బరిలోకి దిగాలని చేస్తున్నారా? అనే టాక్ మొదలైంది.
ఏదేమైనప్పటికీ ఫస్ట్ లిస్ట్‌లో జనసేనాని పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాకపోవడంతో ప్రస్తుతం జనసైనికులు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పవన్ కల్యాణ్ పేరు తప్పక ఉంటుందని ఆశిస్తున్నారు.