శేషాచలం సానువుల్లో వెలసిన అసమాన దివ్యక్షేత్రం తిరుమల(Tirumala). నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలేశుడి సేవలో తరిస్తుంటారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా శ్రీవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది టీటీడీ(TTD). అయితే.. చైర్మన్ గా తమకు అనుకూలమైన వారిని పాలకమండలి సభ్యులుగా ప్రముఖులను నియమిస్తుంటుంది ప్రభుత్వం. గత రెండు పర్యాయాలుగా సీఎం జగన్(CM Jagan) కుటుంబసభ్యుడైన వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) చైర్మన్ గా కొనసాగుతున్నారు.
ఈసారి చైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్ గా సేవలందించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్ గా కొనసాగుతున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా భూమనకి పేరుంది.
ఇక 2019 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా తొలిసారి ప్రభుత్వం నియమించింది. తిరిగి 2021 జూన్ 22న పదవీ కాలం ముగియడంతో తిరిగి ఆయనకే రెండోసారి బాధ్యతలను అప్పగించింది. 2021 ఆగష్టు 8న వైవీ సుబ్బారెడ్డి రెండోసారి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చైర్మన్ గా చాలా పేర్లు తెరపైకి వచ్చినా.. కరుణాకర్ రెడ్డికే జై కొట్టారు జగన్.