తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) సమయం తక్కువగా ఉండటంతో రాజకీయం చిత్ర విచిత్ర వేషాలు వేస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారు, పార్టీల్లో గుర్తింపు లేని వారు ఇతర పార్టీల్లోకి జంప్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. మరోవైపు ఎన్నికల ముందు అధికార పార్టీలోకి భారీగానే చేరికలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం.. కానీ ఇక్కడ ఊహించింది వేరు జరిగేది వేరు..
బీఆర్ఎస్ నుంచి, ప్రతిపక్ష బీజేపీ పార్టీల నుంచి ఊహించని రీతిలో నేతలంతా కాంగ్రెస్లోకి జంప్ అవుతూ ట్విస్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీ వేదికగా కండువాలు కప్పుకోగా.. తాజాగా బీజేపీ నుంచి ఒకరు.. బీఆర్ఎస్ నుంచి మరొకరు హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy),మండవ వెంటేశ్వరరావు (Mandava Venteswara Rao)..
మరోవైపు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) టీడీపీ (TDP) పొత్తులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు రేవూరి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే వరంగల్ పశ్చిమనియోజకవర్గం నుండి పోటీచేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా గత ఎన్నికల్లో 46వేల పైచిలుకు ఓట్లు సాధించారు రేవూరి ప్రకాశ్ రెడ్డి..
తెలంగాణలో టీడీపీ బలగం తగ్గడంతో రేవూరి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మండవకు ఇంటికెళ్లి మరీ కేసీఆర్ గులాబీ కండువా కప్పారు. పార్టీలు అయితే మారారు కానీ.. ఏళ్లు గడుస్తున్నా ఈ ఇద్దరికీ ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదనే ఆరోపణలు మాత్రం అభిమానుల నుంచి వస్తున్నాయి. దీంతో కాషాయ కండువా తీసేయాలని రేవూరి.. కారు దిగేయాలని మండవ భావించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు కలిసి పనిచేసిన తన మిత్రులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు. మొత్తానికి హస్తంలోకి చేరికలు భారీగానే సాగుతున్నాయ్. మరి ఏమాత్రం ఫలితాలు వస్తాయో తెలియాలంటే కాస్త ఆగవలసిందే..