Telugu News » Abraham : బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టిన అలంపూర్ రాజకీయాలు.. పార్టీ వీడిన కీలక నేత..!!

Abraham : బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టిన అలంపూర్ రాజకీయాలు.. పార్టీ వీడిన కీలక నేత..!!

నామినేషన్‌కు ఒకరోజు ముందు విజయుడికి టికెట్ ప్రకటించడంతో అప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసిన అబ్రహం తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటినుండి మౌనంగా ఉన్న అబ్రహం ఇటీవల అలంపూర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళ్ళలేదు.

by Venu

జోగులాంబ (Jogulamba) గద్వాల (Gadwal) జిల్లా అలంపూర్ (Alampur)లో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్గత పోరు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ప్రస్తుతం అలంపూర్ లో జరుగుతున్న రాజకీయ రచ్చ.. చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం బీఆర్ఎస్‌ను వీడారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..

మొదట అబ్రహం (Abraham) కూడా అలంపూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రకటించి అందరితో పాటు అబ్రహంకు కూడా టికెట్ కేటాయించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికైన చల్ల వెంకట్రామిరెడ్డి తన ఆధిపత్యాన్ని చాటేందుకు అబ్రహంకు బి ఫామ్ దక్కకుండా చేశాడని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఆయన వ్యక్తిగత సహాయకునిగా ఉండే విజయుడికి టికెట్ ఇప్పించడం రాజకీయ దుమారానికి తెరలేపింది.

నామినేషన్‌కు ఒకరోజు ముందు విజయుడికి టికెట్ ప్రకటించడంతో అప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసిన అబ్రహం తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటినుండి మౌనంగా ఉన్న అబ్రహం ఇటీవల అలంపూర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళ్ళలేదు. ఒకవైపు అధిష్టానం పట్టించుకోకుండా అవమాన పరచడం నచ్చని అబ్రహం, పార్టీ మారేందుకు సిద్దం అయ్యారు. తన అనుచరులతో కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరి వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. .

మరోవైపు ఈ మధ్య కాలంలో చల్లా తీరు, అధిష్టానం నిర్ణయంతో విసుగు ఎత్తిన పలువురు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలకు నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో అలంపూర్ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి బిగ్ షాక్ తగలడంతో స్థానిక రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి..

You may also like

Leave a Comment