ప్రస్తుతం సమాజంలో మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోయిందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఊపిరి తీయడం ఉల్లిగడ్డ పొర తీసినంత సులువుగా మారిపోయింది.. మనిషికి కోపం.. మనసులో ద్వేషం పెరిగిందంటే చాలు చిటికెలో నిర్ణయాలు తీసుకోవడం.. క్షణంలో అనుకున్న దారుణాన్ని చేయడం.. చట్టం శిక్షిస్తుందన్న భయం కూడా ఉండటం లేదు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే బీహార్ (Bihar)లో జరిగింది.
బీహార్లోని లఖిసరాయ్ (Lakhisarai)లో కాల్పులు (Firing Incident) కలకలం సృష్టించాయి.. కబయ్యా (Kabaiya) పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబీ మొహల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఛఠ్ పూజలో భాగంగా సూర్యుడికి అర్ఝ్యం అర్పించి వస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం పట్నా ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు.. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహరమే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నట్టు లఖిసరాయ్ ఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు.