బిహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్(chandra shekar) వివాదాస్పద వ్యాఖ్యల(Controversial comments)తో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రామ్ చరిత్ మానస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రామ్ చరిత్ మానస్‌ను పొటాషియం సైనేడ్ తో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు.
హిందీ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మీ ముందు 55 రకాల వంటకాలు పెట్టి వాటిలో పొటాషియం సైనేడ్ కలిపితే దాన్ని మీరు ఇష్టంగా తింటారా? అని ప్రశ్నించారు. లేదు కదా… హిందూ మత గ్రంథాలు కూడా అంతేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబా నాగార్జున, లోహియా లాంటి రచయితలు గతంలో హిందూ మత గ్రంథాలను విమర్శించారని అన్నారు.
రామ్ చరిత్ మానస్ పట్ల తనకు తీవ్రమైన అభ్యంతరం ఉందన్నారు. తన జీవితాంతం ఈ అభ్యంతరం కొనసాగుతుందన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా కామెంట్ చేశారన్నారు. కుల వివక్ష పోనంత వరకు రిజర్వేషన్లు, కుల గణన చేపట్టాల్సిందేనన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరిత్ మానస్ పై మంత్రి చంద్రశేఖర్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ కు వినపడం లేదా అని ఆయన ప్రశ్నించారు. హిందూ మతంతో మంత్రికి ఏమైనా సమస్యలు వుంటే ఆయన మతం మారాలని నీరజ్ కుమార్ సూచించారు.