Telugu News » LK Advani : జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఎల్కే అద్వానీ ప్రయాణం సాగిందిలా..!

LK Advani : జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఎల్కే అద్వానీ ప్రయాణం సాగిందిలా..!

వయోభారం కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఈయనకు ప్రధాని పదవి వచ్చినట్లే వచ్చి అందకుండా పోయింది. అది ఒక్కటే అద్వానీ చేసిన కృషికి, పడిన శ్రమకు దక్కని ఫలితంగా కాషాయదళం చెబుతూ ఉంటుంది.

by admin

లాల్ కృష్ణ అద్వానీ (LK Advani)… ఇది పేరు కాదు ట్రెండ్ సెట్టర్. ప్రతి భారతీయ జనాతా పార్టీ కార్యకర్తకూ ఆయనో మార్గదర్శి. దేశమంతా కాంగ్రెస్ (Congress) కు ప్రత్యామ్నాయంగా బీజేపీ (BJP) ఎదిగిందంటే ఈయన కృషి ఎంతో ఉంది. ఇప్పటికీ పార్టీలకతీతంగా అద్వానీకి అభిమానులున్నారు. మనసా.. వాచా.. కర్మణా దేశం కోసం, ధర్మం కోసం ముందుకు కదిలారు అద్వానీ. అందుకే, వాజ్‌ పేయితో సహా అందరూ గౌరవించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పోరాటం చేసిన అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న (Bharat Ratna) లభించింది.

biography of lk advani 2

జననం.. విద్యాభ్యాసం

1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ (ప్రస్తుత పాకిస్తాన్) లో జన్మించారు అద్వానీ. కరాచీ, హైదరాబాద్ లలో విద్యనభ్యసించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో ప్రవేశించి ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటబట్టించుకున్నారు. ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. అద్వానీ సంపన్న కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి వ్యాపారవేత్త. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్ 12 నాడు భారత్ కు వచ్చేశారు అద్వానీ. గాంధీజీ హత్య తర్వాత అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యారు.

జనసంఘ్ లో రాజకీయ పాఠాలు

శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశారు అద్వానీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొందారు. ఈయన చురుకుదనం, మాట్లాడే తీరును గుర్తించిన అగ్ర నేతలు ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. అనుకున్నట్టే.. తొలుత రాజస్థాన్ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1966లో తొలిసారి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. 1975లో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి మురార్జీ దేశాయ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక 1980వ దశకంలో అద్వానీ పేరు దేశమంతా మార్మోగింది. 1986లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989 లోక్‌ సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి 86 స్థానాలకు పెంచడంలో అద్వానీ పాత్ర ఎంతో కీలకం. 1989లోనే లోక్‌ సభలో తొలిసారిగా అడుగుపెట్టారు అద్వానీ.

biography of lk advani 4

రథయాత్రతో మారిన చరిత్ర

అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి రామ మందిరం నిర్మించడానికి ప్రజలను ఏకం చేశారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి (1990, సెప్టెంబర్ 25) నాడు ఇది ప్రారంభమైంది. ఈ యాత్ర బీజేపీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడింది. పది వేల కిలోమీటర్ల రథయాత్రను పూర్తి చేయాలనుకున్నా.. బిహార్ ప్రభుత్వం అడ్డుకున్న కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 1991 లోక్‌ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్య 120కి పెరిగింది. అద్వానీ రథయాత్ర ప్రభావం ఈ ఎన్నికలపై బలంగా పడింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీని అరెస్ట్ చేశారు.

ఆ ఒక్క కోరిక నెరవేరలేదు.. కానీ..!

అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో బీజేపీ పగ్గాలు స్వీకరించారు. 1991 వరకు పని చేశారు. రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా ఉన్నారు. చివరగా మోడోసారి 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ కు తన స్థానాన్ని అప్పగించారు. వయోభారం కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఈయనకు ప్రధాని పదవి వచ్చినట్లే వచ్చి అందకుండా పోయింది. అది ఒక్కటే అద్వానీ చేసిన కృషికి, పడిన శ్రమకు దక్కని ఫలితంగా కాషాయదళం చెబుతూ ఉంటుంది. ఇప్పుడు భారత రత్నకు ఎంపిక కావడంతో బీజేపీ శ్రేణులు సంతోషంలో ఉన్నాయి.

You may also like

Leave a Comment