తన పుట్టిన రోజు వేడుకను (Birthday Celebration) దుబాయ్‌లో (Dubai) జరపాలని ఓమహిళ తన భర్తను కోరింది. దానికి అతడు తిరస్కరించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. భర్తతో గొడవపడి అతడి ముఖంపై విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పుణె(Pune)లో చోటుచేసుకుంది.
నిఖిల్ ఖన్నా (Nikhil Khanna) పుణెలో ప్రముఖ వ్యాపారి. ఆరేళ్ల కిందట వయసులో తనకంటే రెండేళ్లు పెద్దదైన రేణుక(38)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, అంతా బాగానే ఉంది కదా అనుకుంటే పొరపాటే. వీరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య పుట్టిన రోజు వేడుక విషయంలో గొడవ జరిగింది.
తన బర్త్‌డేను దుబాయ్‌లో నిర్వహించాలని భార్య పట్టుబట్టింది. దీనికి భర్త ససేమిరా అన్నాడు. అప్పటికే తన తరఫు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లనివ్వడం లేదని, తన పుట్టిన రోజు, పెళ్లిరోజుకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదని కోపంతో ఉన్న రేణుక.. నిఖిల్‌తో గొడవకు దిగింది. అదికాస్తా ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో రేణుక అతడి ముఖంపై విచక్షణారహితంగా కొట్టడంతో అతడి పళ్లు రాలిపోయాయి. అదేవిధంగా ముక్కుపై బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. చూస్తుండగానే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.