– బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా
– అంతా బీజేపీ వల్లేనంటూ విమర్శ
– ఆర్ఎస్పీ వ్యాఖ్యలు నమ్మేలా ఉన్నాయా?
– బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తుకి బీజేపీకి సంబంధమేంటి?
– మొన్నటిదాకా బద్మాష్ రాష్ట్ర సమితి అని తిట్టావ్
– ఇప్పుడేమో కేసీఆర్ పంచన చేరావ్
– బహుజనుల కోసం పని చేస్తానన్నావ్
– బలవంతుడి దగ్గర భాంచన్ దొర అన్నావ్
– ఆర్ఎస్ పై బీజేపీ, ప్రజా సంఘాల ఆగ్రహం
– కవిత అరెస్ట్ డైవర్షన్ ప్లాన్ అయి ఉండొచ్చని అనుమానం
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఆ వెంటనే మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. చారిత్రక బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తును భగ్నం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శలు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్ మాటలు నమ్మేలా ఉన్నాయా?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్టీలోని కీలక నేతలంతా జంప్ అవుతున్నారు. కిందిస్థాయి లీడర్లు కూడా గుడ్ బై చెప్తున్నారు. చివరకు కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే మిగులుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి పార్టీతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పొత్తుకు ప్రయత్నాలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. అది సఫలం కూడా అయింది. నాగర్ కర్నూల్ తోపాటు హైదరాబాద్ సీటును బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. దీనిపై శుక్రవారం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది జరిగి 24 గంటలు తిరగకముందే బీఎస్పీకి గుడ్ బై చెప్పారు ప్రవీణ్. దీనికి కారణం బీజేపీ అని, తమ పొత్తును విడదీయాలని చూస్తోందని అన్నారు. ఇక్కడే ఆయన దొరికిపోయారు. బీజేపీ కుట్ర అని ఓ మాట మీడియా ముందు చెప్పేసి వెళ్లిపోయారు. ఏం జరిగింది? కుట్ర ఎలా జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కావాలనే డ్రామా క్రియేట్ చేయడానికి ఇలా మాట్లాడారనే చర్చ మొదలైంది.
ఆర్ఎస్పీకి బీజేపీ, ప్రజా సంఘాల ప్రశ్నలు
తాను ఎక్కడున్నా బహజనుల కోసం కొట్లాడుతానని ఆర్ఎస్ అంటున్నారు. పొత్తు ధర్మం పాటించాలనే బీఎస్పీకి రాజీనామా చేశానని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీఆర్ఎస్ తో కొనసాగుతానని ఏవోవో చెప్పారు. అయితే.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయింది మొదలు కేసీఆర్ ను అనరాని మాటలు అన్నారు. స్కాముల సర్కార్, అవినీతి ప్రభుత్వం, బద్మాష్ రాష్ట్ర సమితి అంటూ నానా తిట్లు తిట్టారు. మరి, ఇప్పుడవన్నీ రైట్ అయ్యాయా? కేసీఆర్ అసలు అవినీతికి పాల్పడలేదా? దొరల గడీలను బద్దలుకొడతానని చెప్పి.. చివరకు ఆ దొరల గడీకే చేరడం ఎంతవరకు కరెక్ట్? బహుజనుల కోసం పనిచేస్తానని, బలవంతుడి దగ్గర భాంచన్ దొర అంటావా? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పొత్తును సమర్ధించుకోవడానికి బీజేపీని బూచిగా చూపిస్తారా? అంటూ ఆ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ ను ప్రశ్నిస్తున్నారు.
కవిత అరెస్ట్ డైవర్షన్ ప్లానా?
పొత్తులో భాగంగా టెకెట్లు కూడా కేటాయించుకున్నాక సడెన్ గా ఆర్ఎస్పీ రాజీనామా వెనుక మరో కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇది మోడీ కుట్ర అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. పనిలోపనిగా కేసీఆర్ పంచన చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఓ ట్వీట్ చేశారు. కవితకు క్లీన్ చీట్ ఇచ్చేలా మాట్లాడారు. గతంలో ఈయన కవితను ఎందుకు అరెస్ట్ చేయరంటూ మోడీని ప్రశ్నిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ, ఇప్పుడేమో ఈడీని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమ అరెస్ట్, బూటకం అంటూ ఫైరయ్యారు. దీన్నిబట్టి, ప్రవీణ్ రాజీనామా, బీజేపీని బ్లేమ్ చేయడం అంతా కవిత అరెస్ట్ ను డైవర్ట్ చేసే ప్లాన్ గా కనిపిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.