– చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కాదు
– ఇది కక్షపూరితమని స్పష్టంగా కనిపిస్తోంది
– భవిష్యత్ లో ఇదే సీన్ రిపీట్ అవ్వొచ్చు
– జీ-20 అప్పుడే చంద్రబాబు అరెస్ట్ కావడం..
– అనుమానాలకు తావిస్తోంది
– బీజేపీ అంటే కేసీఆర్ కు భయం
– అందుకే, కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపుతున్నారు
– ఏం చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేరన్న బండి సంజయ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ పై బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. చంద్రబాబు నిజంగా తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. చట్ట ప్రకారం ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు. కాకపోతే.. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ కక్ష పూరితంగా ఉందనేది స్పష్టంగా కన్పిస్తోందన్నారు బండి. ఆదరబాదరగా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఇమేజ్ అమాంతం పెరిగిందని.. పార్టీలతో సంబంధం లేని ప్రజలు కూడా చంద్రబాబు అరెస్ట్ ను తప్పు పడుతున్నారని వైసీపీ (YCP) తెలుసుకోవాలని తెలిపారు. వాస్తవాలు మాట్లాడితే తమను చంద్రబాబు ఏజెంట్ గానో, పవన్ (Pawan) ఏజెంట్ గానో ప్రచారం చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని సెటైర్లు వేశారు.
ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని.. వైసీపీ నేతలు ఇకనైనా తమ తప్పులను సరిదిద్దుకుంటే ఆ పార్టీ గ్రాఫ్ ప్రజల్లో పెరుగుతుందని అన్నారు సంజయ్. యావత్ ప్రపంచం జీ-20 సదస్సు గురించి చర్చిస్తుంటే.. అదే రోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక కుట్ర ఉందని తెలిపారు. మీడియాను డైవర్ట్ చేయడం ద్వారా తెలుగు ప్రజలు జీ-20 సదస్సును చూడకుండా చేశారని అభిప్రాయపడ్డారు.
రేపు వైసీపీ అధికారం కోల్పోతే ఏర్పడబోయే ప్రభుత్వం వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశముందన్నారు బండి. ఇందుకోసమేనా ఏపీ ప్రజలు ఎన్నుకుంది? ప్రజా సమస్యలు మీకు పట్టవా? ఒకసారి ఆలోచించుకోండని సూచించారు. ఇక తెలంగాణలో రాజకీయ పార్టీ నేతల మధ్య వైషమ్యాలు పెంచుతూ శత్రువులుగా చూసే దుస్థితికి కారకుడు కేసీఆరేనని విమర్శించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తో కుమ్మక్కైనట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. కొంతమంది మూర్ఖులు కావాలని చేస్తున్న దుష్ప్రచారంలో ఇది భాగమేనన్నారు. తాను దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై కొట్లాడే వ్యక్తినే తప్ప కుమ్కక్కు రాజకీయాలు తనకు తెలియవని స్పష్టం చేశారు. తనపై దుష్ర్పచారం చేసే వారికి దమ్ముంటే తనతో నేరుగా కొట్లాడాలని సూచించారు.
భూములమ్మి జీతాలిచ్చే దుస్థితిలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఉందన్న బండి… రాష్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారని… మళ్లీ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ కు బీజేపీ అంటేనే భయం వేస్తోంది. అందుకే కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు.. అందుకే అడ్డగోలు హామీలతో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కేంద్రాన్ని బద్నాం చేయడం, మోసపూరిత హామీలివ్వడం, కాంగ్రెస్ ఇమేజ్ పెంచడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు’’ అంటూ విమర్శించారు. ఒవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా కేసీఆర్ ప్రకటించారని అన్నారు బండి సంజయ్.