Telugu News » Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గురువు ఎంఐఎం!

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గురువు ఎంఐఎం!

నియంతృత్వ పాలన చేసేవారిని ప్రజలు ఎంతో మందిని చూశారని.. వారంతా కనిపించకుండా పోయారని.. కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందని అన్నారు కిషన్ రెడ్డి. శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని.. అనేక మంది గాయపడ్డారని తెలిపారు.

by admin
kishan-reddy-ends-deeksha-at-bjp-state-office

– ఉద్యమంలో కూడా ఇంత అణచివేత చూడలేదు
– ఆనాడు పోలీసులు ఇలాగే ప్రవర్తించి ఉంటే..
– కేటీఆర్, కవిత అమెరికా పారిపోయేవారు
– ప్రజల కోసం పోరాడుతుంటే కొడతారా?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ ను నమ్మితే నట్టేట మునగడమే
– తెలంగాణ ప్రజలకు శాపంగా ఆ పార్టీలు
– బీజేపీకి ఓ ఛాన్స్ ఇవ్వాలన్న కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). రాష్ట్రంలో అనేక సమస్యలపై బీజేపీ పోరాటాలు చేస్తోందని.. కానీ, సీఎం అణచివేత ధోరణితో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం నిరసన తెలియజేసే పరిస్థితి లేదన్నారు. సంఘాలను సీఎం నిర్వీర్యం చేశారని విమర్శించారు. బయట ఉద్యమాలు చేయవద్దు, అసెంబ్లీలో మాట్లాడవద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

kishan-reddy-ends-deeksha-at-bjp-state-office

నియంతృత్వ పాలన చేసేవారిని ప్రజలు ఎంతో మందిని చూశారని.. వారంతా కనిపించకుండా పోయారని.. కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందని అన్నారు కిషన్ రెడ్డి. శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని.. అనేక మంది గాయపడ్డారని తెలిపారు. ‘‘తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరాం. ఉద్యోగం రాదన్న బాధతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయని దుర్మార్గపు ప్రభుత్వం ఇది. నియామక పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి నెలా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేస్తున్నాం. పేపర్ లీకేజ్ అయితే.. పరీక్షలకు సిద్ధమైన యువకులు కుటుంబం ఎంత బాధపడుతుందో కేసీఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా?’’ అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

ఒకనాడు 369 మంది యువకులు పోలీసు తూటాలకు బలైంది నియామకాల కోసమేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ స్థాయిలో అప్పటి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుగా ఉద్యమంలో చేసి ఉంటే కేటీఆర్, కవిత అమెరికా పారిపోయే వారని సెటైర్లు వేశారు. ‘‘కేసీఆర్ ఏనాడూ సకల జనుల సమ్మె, సాగర హారంలో పాల్గొన లేదు. ఉద్యమ పోరాటం నుంచి పారిపోయిన వ్యక్తి. మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ప్రజల ఆశీస్సులు మాపై ఉన్నాయి. తెలంగాణ రాకముందు మనను కాంగ్రెస్ పార్టీ దోచుకుంది. ఉద్యమకారురను కాల్చి చంపింది. కాంగ్రెస్ హయాంలో పోలీసుల కాల్పులు తెలంగాణ ప్రజలు మరువకూడదు. తెలంగాణ సమాజంపై ఆ పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

సోనియా, కేసీఆర్ కుటుంబాలు అత్యంత సన్నిహితమైనవేనని ఆరోపించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ను సమర్ధిస్తే బీఆర్ఎస్ ను సమర్ధించినట్టేనని అన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. వీటికి గురువు అసదుద్దీన్ ఒవైసీ అని.. ఆయన ఏది రాసిస్తే వీళ్ళు అదే మాట్లాడుతారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న కిషన్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తామని… ముద్రా రుణాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.

You may also like

Leave a Comment