తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana assembly Elections 2023) సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులతో బీజేపీ (Telangana BJP) ఆదివారం తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాజీనామా వరకు వెళ్తున్నారు. తాజాగా ఓ బీజేపీ మహిళా నేత ఇన్ని రోజులు కష్టపడి పని చేసిన తనకు భారతీయ జనతా పార్టీ(Bjp) ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తన ఆవేదనను వెల్లగక్కుతూ బోరున విలపించింది.
వివరాల్లోకి వెళితే.. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ముథోల్ టికెట్‌ను తనకు కాదని రామారావు పటేల్‌కు కేటాయించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా ముందు కంటతడి పెట్టుకుంది. పార్టీ కోసం తాను తిరిగిన సమయంలో నవ్విన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ వాపోయింది. తాను కట్టిన ఇంట్లో వేరే వారు గృహ ప్రవేశం చేస్తానంటే కడుపులో బాధ కాదా? అంటూ బోరుమని విలపించింది. తనకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేసిందంటూ ఆరోపించారు.
డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రమాదేవి. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపింది. ముథోల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని వేడుకుంది. పార్టీ నేతల బుజ్జగింపులతో ఆమె మనసు మార్చుకుంటుందా? లేదా కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరుతారా? అన్న అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్కు ఆ పార్టీ అగ్రనేతలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి ఈ అంశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్న బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లోనూ వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు లేవు. వీరు ఆసక్తి చూపకపోవడంతోనే వీరి పేర్లను ఫస్ట్ లిస్ట్‌లో బీజేపీ చేర్చలేదని తెలుస్తోంది. రేపు కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు రాహుల్ అపాయిట్మెంట్ ఖరారైనట్లు సమాచారం.