టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాక ఆ పార్టీతో జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే(NDA)లో బీజేపీ(BJP) భాగస్వామిగా ఉంటున్న జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో అమిత్‌షా(Amithshah) తో పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమిత్ షాతో భేటీ అయిన పవన్ కల్యాణ్ దాదాపు 40నిమిషాల పాటు చర్చించారు. తెలంగాణాలో మాత్రమే ఎన్నికల పొత్తు గురించి ప్రస్తుతం బీజేపీ సుముఖంగా ఉందని, ఏపీలో పొత్తు విషయమై సుముఖంగా లేదని బుధవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ పాల్గొన్న ఈ భేటీలో తెలంగాణ ఎన్నికల గురించి మాత్రమే చర్చించినట్లు చెబుతున్నారు.
బీజేపీతో సంప్రదించకుండా టీడీపీతో ఏకపక్షంగా పవన్‌కళ్యాణ్ పొత్తును ప్రకటించడాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతిచ్చే విషయంలో పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో ప్రాథమికంగా చర్చించామన్నారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడాలని పవన్ కల్యాణ్ కోరడంతోనే ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలిపారు.
ఏపీలో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో జనసేన 32 సీట్లు కోరుతోంది. ఐదారు సీట్ల కంటే మించి వదిలేందుకు బీజేపీ సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. బీజేపీ రెండో విడత జాబితా విడుదలయ్యాక ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.