– బీజేపీకి కీలక నేత గుడ్ బై
– రాజీనామా చేసిన వెంకట్ రెడ్డి
– కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ నాయకులు జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తుతున్నారు. ఎంతో కష్టపడుతున్నా.. పార్టీలో గౌరవం దక్కడం లేదని గుడ్ బై చెబుతున్నారు. తాజాగా బీజేపీ (BJP) కీలక నేత వెంకట్ రెడ్డి (Venkat Reddy) రాజీనామా బాటలో నడిచారు. బీజేపీకి కటీఫ్ చెప్పేశారు. ఆయన భార్య, బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మ కూడా రిజైన్ చేశారు.
ఇప్పటివరకు గద్వాల జిల్లా బీజేపీ ఇంచార్జ్ గా ఉన్నారు వెంకట్ రెడ్డి. గతంలో హైదరాబాద్ (Hyderabad) బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇంతకాలం కిషన్ రెడ్డి (Kishan Reddy) కి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈయన.. అంబర్ పేట (Amberpet) టికెట్ ఆశించారు. దీనిపై కిషన్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామా సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. గత 43 ఏళ్లుగా బీజేపీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్నప్పటికీ పార్టీ గుర్తించలేదని ఆరోపించారు. అవమానాలు భరించలేక రాజీనామా చేసి బీఆర్ఎస్ (BRS) లో చేరుతున్నట్టు వెల్లడించారు. ఈక్రమంలోనే బీజేపీని వీడుతున్నందుకు కన్నీటి పర్యంతమయ్యారు. నెలరోజులుగా కిషన్ రెడ్డి సమాధానం కోసం వెయిట్ చేసి.. చివరకు రాజీనామా చేశామని తెలిపారు.
ప్రెస్ మీట్ అయిన అనంతరం.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ (Kaleru Venkatesh) తో కలిసి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు వెంకట్ రెడ్డి. అక్కడ మంత్రి కేటీఆర్ (KTR) ను కలిశారు. వెంకట్ రెడ్డి, పద్మకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి. కాలేరు వెంకటేష్ విజయానికి తమ శాయశక్తులా పనిచేస్తామని అన్నారు.