– మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కేసీఆర్ వల్లే
– నిపుణుల మాట వినలేదు
– కేసీఆరే ఇంజనీర్ గా మారడంతోనే ఈ దుస్థితి
– నిర్మాణంలో చాలా లోపాలున్నాయి
– కేసీఆర్ మౌనమెందుకు?
– లేఖ రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ మొదలవుతుంది
– రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు
– మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన బీజేపీ నేతలు
మేడిగడ్డ (Medigadda) పై కేంద్ర కమిటీ నివేదిక నేపథ్యంలో కేసీఆర్ (KCR) సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. కాళేశ్వరం (Kaleswaram) భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇతర బీజేపీ నేతలు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడకు వెళ్లిన వీరు బ్యారేజ్ ను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని.. నిపుణులు చెప్పినా వినకుండా కేసీఆర్ ఇంజనీర్ గా మారి కట్టడంతో.. ఇప్పుడది గుదిబండగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు కిషన్ రెడ్డి. ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే.. 11 అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయన్న ఆయన.. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తోందని.. కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
ఇంజనీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజినీర్ గా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుందని.. కానీ, కేసీఆర్ ఎందుకు ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40వేల కోట్ల అంచనా వేశారని.. తర్వాత రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. ఈ నిర్మాణంతో వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డ లాగానే అన్నారం బ్యారేజీ పరిస్థితి ఉందని.. బ్యారేజీ పిల్లర్స్ కుంగిపోయి ప్రమాదకరంగా తయారైందని చెప్పారు. రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని ఆరోపించారు. మంచి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడు అయితే కేంద్రంపై నిందలు వేయడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ కోరాలన్నారు కిషన్ రెడ్డి. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.