తెలంగాణలో బీజేపీ (BJP), జనసేన (Janasena) మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు గురించి ఇరు పార్టీల మధ్య కీలక చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంంది. ముఖ్యంగా శేరి లింగం పల్లి, కూకట్ పల్లి నియోజక వర్గాల్లో పోటీకి జనసేన ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇది ఇలా వుంటే బీజేపీకి శేరి లింగం పల్లిలో మంచి పట్టు ఉంది. దీంతో ఈ సీటు బీజేపీకే కేటాయించాలని కాషాయ నేతలు పట్టుబడుతున్నారు.
శేరి లింగం పల్లిలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నేత గజ్జల యోగానంద్‌కే టికెట్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నాంపల్లిలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని పార్టీ ప్రధాన నేతలకు కార్యకర్తలు, ఆయన అభిమానులు వినతి పత్రాలు అందజేశారు. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేత యోగానంద్ అని కార్యకర్తలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నేత ఆయన అని తెలంగాణ బీజేపీ చీఫ్ కు వివరించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రజాసేవ చేస్తున్నారని, ‘మీ సమస్య- మా పోరాటం’అనే నినాదంతో ఆయన ఇప్పటికే ప్రజలకు చాలా దగ్గర అయ్యారని పేర్కొన్నారు. మంచి విద్యావంతుడు, సామాజిక వేత్త అని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు.
గత ఎన్నికల్లో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఆయన గట్టి పోటీ ఇచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తికి ఈ సారి కూడా టికెట్ కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయిస్తే గెలిపించుకునే బాధ్యత తమదేనని కార్యకర్తలు హామీ ఇచ్చారు. దీంతో షేర్ లింగంపల్లి టికెట్ విషయంలో అధిష్టానం ఆలోచనలో పడినట్టు సమాచారం.