ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ( Rakesh Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
తనకు విదేశాల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ తవ్వకాలపై సీబీఐ విచారణ కోరినందుకే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. రోజుకు సుమారు వందకు పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
అక్రమ మొరం తవ్వకాలపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లోని సహజసిద్ధమైన వనరులను కాపాడుతానని రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది ఇలా వుంటే రాకేశ్ రెడ్డి నివాసానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిచ్చారు. దీంతో ఎమ్మెల్యే నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాకేశ్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. తాజాగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తుండటంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.