సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాంటూ ధ్వజమెత్తారు. ‘మా ఆత్మగౌరం తగ్గిస్తే మీ ఆత్మగౌరవం కూడా తగ్గిస్తాం’అని అన్నారు.
ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేపీ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆర్మూర్లో పరాజయం పాలైన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజ స్వామ్య బద్దంగా వినయ్ రెడ్డి రాజకీయం చేయాలన్నారు. లేదంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మెల్యేవార్నింగ్ ఇచ్చారు.
చట్టం తన పని చేయక పోతే రాకేశ్ రెడ్డి చట్టం మొదలవుతుందని హెచ్చరించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వెల్లడించారు. అందువల్ల రేవంత్ రెడ్డి, తాను సమానమేనని చెప్పారు. ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలన్నారు.
ఓడిపోయిన వ్యక్తులు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారు? అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పాత మంత్రులు, పాత సీఎం దగ్గర సమీక్ష నిర్వహించుకుంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.