బీజేపీ (BJP) నుంచి జహీరాబాద్ ఎంపీగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) పోటీ చేస్తారంటూ ఇటీవల వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. ఎంపీ పదవికి పోటీ చేసే విషయంలో తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు.
కానీ పార్టీ మాత్రం తనను జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని చెబుతోందన్నారు. తాను హిందు రాజ్య స్థాపన కోసం దేశ వ్యాప్తంగా పని చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో రాజాసింగ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ……
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నియోజక వర్గంలో బండి సంజయ్ తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. కిషన్ రెడ్డి కోరితే సికింద్ర బాద్ లో కూడా తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఫ్లోర్ లీడర్ పదవిపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన విషయంలో జాప్యం చేయడం మంచిది కాదని అన్నారు.
వీలైనంత త్వరగా ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా నియామిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లామని గుర్తు చేశారు. అందువల్ల ఫ్లోర్ లీడర్‌గా బీసీ వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని జాతీయ నాయకత్వం భావిస్తోందని వివరించారు.