Telugu News » India Today : ముచ్చటగా మూడవ సారి నరేంద్రుడికే పట్టం…..!

India Today : ముచ్చటగా మూడవ సారి నరేంద్రుడికే పట్టం…..!

. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

by Ramu
Mood of the Nation poll: How states would vote if polls were held today

– మోడీ సర్కార్ పట్ల ప్రజలు సంతృప్తి
-మెజార్టీ రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు ఎన్డీఏకే
-రామ మందిరం హైలెట్ అని 42 శాతం
-భారత్ కు గ్లోబల్ గా గుర్తింపుపై 19
-ఆర్టికల్ 370 రద్దుపై 12
-సర్జికల్ స్ట్రైక్స్ పై 9 శాతం
-నోట్ల రద్దుపై 6 శాతం
-కరోనా మేనేజ్ మెంట్ పై 6 శాతం
-అవినీతి నిర్మూలనపై 5 శాతం
– మోడీకి మద్దతు తెలిపిన ప్రజలు

ఇండియా టుడే (India Today) ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పాలన పట్ల దేశ ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే మెజార్టీ రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని పేర్కొంది. దీంతో వరుసగా మూడవ సారి మోడీ ప్రధాని పదవిని చేపడతారని తెలిపింది.

Mood of the Nation poll: How states would vote if polls were held today

దేశ వ్యాప్తంగా పలు లోక్ సభ స్థానాల్లో ఈ ఒపీనియన్ పోల్ ను గతేడాది డిసెంబర్ 15న నిర్వహించారు. మొత్తం 35,801 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ ఏడాది జనవరి 28 వరకు ఈ సర్వేను నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక మోడీ ప్రభుత్వ పాలనలో హైలెట్ అని 42 శాతం తెలిపారు. భారత్‌ను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చినందుకు ప్రధాని మోడీ పట్ల 19 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరో సానుకూల అంశమని 12 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో 9 శాతం మంది, పెద్ద నోట్ల రద్దు విషయంలో 6 శాతం మంది, కరోనా నిర్వహణ విషయంలో 6 శాతం మంది, అవినీతి నిర్మూలన విషయంలో 5 శాతం మంది అనుకూల వైఖరిని కనబరిచారని సర్వే పేర్కొంది. సర్వే ప్రకారం రాష్ట్రాల వారీగా ఎన్డీఏ వచ్చే సీట్ల సంఖ్యను చూస్తే……

అసోం : అసోంలో ఎన్డీఏ కూటమికి 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, యూపీఏ మూడు స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 36.05 ఉండగా ఈ ఎన్నికల్లో 46 శాతానికి పెరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ఓట్ల శాతం గత ఎన్నికల్లో 35.44 శాతం నుంచి 23 శాతానికి పడిపోతుంది.

బిహార్ : బిహార్‌లో గతంతో పోలిస్తే కాస్త సీట్లు తగ్గినా ఎన్డీఏ కూటమికి ఎదురు లేదని తెలిపింది. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య 32కు పడిపోతుంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి స్థానాల సంఖ్య పెరుగుతుంది. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఒక స్థానం దక్కగా…. ఇప్పుడు 8 స్థానాలకు ఆ సంఖ్య పెరగనుంది. బీజేపీ ఓటింగ్ శాతం 53 నుంచి 52 శాతానికి పడిపోతుంది. ఇండియా కూటమికి 7శాతం ఓటింగ్ పెరుగుతుంది.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కమలం పార్టీ హవా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో మాదిరిగా మొత్తం ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇక ఓటింగ్ విషయంలో బీజేపీకి గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా 57 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నారు. ఇండియా కూటమి ఓటింగ్ శాతం గతంలో 41 ఉండగా అది ఈ సారి 40 శాతానికి పడిపోతుంది.

గుజరాత్ : గుజరాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2019లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ మొత్తం 26 స్థానాలను అందుకోబోతోంది. గతంతో పోలిస్తే బీజేపీ ఓటింగ్ శాతం 62లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ కాంగ్రెస్ ఓటింగ్ శాతం 32 నుంచి 26 శాతానికి పడి పోతుంది.

హర్యానా : రాష్ట్రంలో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గనుంది. మొత్తం 10 స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయ కేతనం ఎగుర వేస్తుంది. ఇక ఇండియా కూటమికి గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరగనుంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్… ఈ ఏడాది రెండు సీట్లలో విజయం సాధిస్తుంది. బీజేపీ ఓటింగ్ శాతం 58 నుంచి 50 శాతం పడిపోగా, కాంగ్రెస్ ఓటింగ్ 28 నుంచి 38 శాతానికి పెరిగింది.

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. గడిచిన ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఏడాది కూడా 4 స్థానాలను దక్కించుకుంటుంది. ఓటింగ్ శాతం 69 నుంచి 60 శాతానికి పడిపోగా… కాంగ్రెస్ ఓటింగ్ శాతం 27 నుంచి 29 శాతానికి పెరిగింది.

జార్ఖండ్ : రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయనున్నాయి. ఈ సారి కూడా 14 స్థానాలకు గాను బీజేపీ 12 ,కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఉంది. బీజేపీ ఓటింగ్ 55 నుంచి 56 శాతానికి పెరగనుంది. కాంగ్రెస్ ఓటింగ్ 35 నుంచి 30 శాతానికి తగ్గనుంది.

కర్ణాటక: రాష్ట్రంలో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గనుంది. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయం సాధించిన కాషాయ పార్టీ ఈ సారి 24 స్థానాలకే పరిమితం కానుంది. కాంగ్రెస్ 1 స్థానం నుంచి 4 స్థానాలకు పెరిగి కాస్త బలం పుంజుకోనుంది. బీజేపీ ఓటింగ్ శాతం 53లో, కాంగ్రెస్ 42లో ఎలాంటి మార్పు ఉండదు.

కేరళ : రాష్ట్రంలో ఎప్పటి లాగానే ఎన్డీఏ కూటమికి భారీ షాక్ తగలనుంది. ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఖాతా తెరిచే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తం 20 స్థానాలను ఇండియా కూటమి తన ఖాతాలో వేసుకోనుంది. ఇక గత ఎన్నికల్లో 15 శాతం నుంచి 17 శాతం ఓటింగ్ పెరిగి బీజేపీ కాస్త బలపడనుంది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం 83 నుంచి 78కి పడిపోనుంది.

మహారాష్ట్ర : ఇండియా కూటమికి కాస్త మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 26, బీజేపీకి 22 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 45 శాతం, బీజేపీకి 40 శాతం ఓటింగ్ వచ్చే ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ 41 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానం, ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.

మధ్య ప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 27 స్థానాలను గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 58 శాతం, కాంగ్రెస్‌కు 38.2 శాతం ఓట్లు రావచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఎన్డీయే 28 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.

పంజాబ్ : రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చెరో ఐదు సీట్లు గెలుచుకుంటాయని అంచనా. బీజేపీ రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆప్‌కు 27 శాతం, కాంగ్రెస్‌కు 38 శాతం, బీజేపీకి 17 శాతం, శిరోమణి అకాలీదళ్‌కు 14 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయి. గతంలో ఆప్ కు 7 శాతం, కాంగ్రెస్ 40, బీజేపీ 10, శిరోమణి అకాలీదళ్‌కు 28 శాతం, ఇతరులకు 15 శాతం ఓట్లు వచ్చాయి.

రాజస్థాన్ : గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా మొత్తం 25 స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. ఎన్డీఏ ఓటింగ్ శాతం 61 నుంచి 59, ఇండియా 34 నుంచి 35, ఇతరుల ఓటింగ్ 5 నుంచి 6 శాతానికి మారనున్నాయి.

తమిళనాడు : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఖాతా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎన్డీఏ ఓటింగ్ షేర్ 12 నుంచి 15 శాతానికి పెరగుతుంది. ఇక కాంగ్రెస్ ఓటింగ్ శాతం 53 నుంచి 47 శాతానికి తగ్గనుంది. ఇతరుల ఓటింగ్ శాతం 35 నుంచి 38 శాతం పెరగనుంది.

తెలంగాణ : రాష్ట్రంలో ఈ సారి 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకోగా ఈ సారి ఆరు స్థానాలను బీఆర్ఎ‌స్ కోల్పోతుందని స్పష్టం చేసింది. బీజేపీ కూడా గతంలో పోలిస్తే ఈ సారి ఒక స్థానాన్ని కోల్పోనుంది. ఆ పార్టీకి మూడు స్థానాలు వస్తాయి.

యూపీ : రాష్ట్రంలో బీజేపీ బలం మరింత పెరగనుంది. 80 స్థానాలకు గాను 72 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో ఈ సంఖ్య 64గా ఉంది. ఇండియా కూటమి స్థానాల సంఖ్య 6 నుంచి 8కి పెరిగే అవకాశం ఉంది ఓటింగ్ శాతం 51 నుంచి 52 శాతం, ఇండియా కూటమి 26 నుంచి 36 శాతం పెరిగే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో బీజేపీ విజయ దుందుబీ మోగించనుంది. మొత్తం 5 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసి గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయనుంది. ఇక్కడ ఇండియా కూటమి ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ఓటింగ్ శాతం 61 నుంచి 59 శాతానికి, ఇండియా కూటమి 31 నుంచి 32కు చేరుతుంది.

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. గత ఎన్నికల్లో 18 సీట్లు గెలిచిన బీజేపీ… మరో స్థానాన్ని ఈ సారి అదనంగా గెలుచుకోనుంది. టీఎంసీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఎంసీ 22, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఓటింగ్ శాతం బీజేపీ గతంతో పోలిస్తే 40 శాతంలో మార్పు లేకపోగా…. ఇండియా కూటమి ఓటింగ్ శాతం 57 నుంచి 53కు పడిపోయింది.

జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్‌లో గత ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయి. మొత్తం 5 స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏ ఓటింగ్ శాతం 46 నుంచి 49 కి పెరగ్గా… ఇండియా కూటమి ఓటింగ్ 39 నుంచి 36 శాతానికి పడిపోయింది.

ఏపీ : ఏపీలో టీడీపీ భారీ విజయాన్ని అందుకోనుంది. ఈ సారి 25 సీట్లలో 17 స్థానాల్లో టీడీపీ విజయం సాధించనుంది. ఇక వైసీపీ గత ఎన్నికల్లో 25 స్థానాల్లో విజయం సాధించగా ఈ సారి ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోనుంది. బీజేపీ ఓటింగ్ శాతం 1 నుంచి 2 శాతానికి, కాంగ్రెస్ 1 నుంచి 3 శాతానికి, టీడీపీ ఓటింగ్ 40 నుంచి 45 శాతానికి పెరగనుంది. ఇక వైసీపీ ఓటింగ్ శాతం 49 నుంచి 41 శాతానికి పడిపోనుంది.

You may also like

Leave a Comment