బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పదవీ కాలాన్ని ఆ పార్టీ పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. తాజాగా పార్టీ జాతీయ కౌన్సిల్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
అంతేకాకుండా జేపీ నడ్డాకు కొన్ని విశేష అధికారాలను పార్టీ కట్టబెట్టింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు ఇచ్చారు. ఢిల్లీలో రెండు రోజులుగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల గురించి చర్చించేందుకు వేలాది మంది పార్టీ సభ్యులు అగ్ర నాయకత్వం నేతృత్వంలో సమావేశమయ్యారు. పార్టీ జాతీయ అద్యక్షుడి పదవీ కాలాన్ని పొడిగించాలని గతంలో తీసుకున్న నిర్ణయంపై తాజాగా చర్చించి దానికి పార్టీ ఆమోదం తెలిపింది.
జేపీ నడ్డా 2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2020లో పూర్తిస్థాయి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇది ఇలా వుంటే శనివారం నడ్డా మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తల బలాలు, సామర్థ్యాలపై తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 370 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని, ఎన్డీయే 400 సీట్లను దాటేలా చూడాలని బీజేపీ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.