– సెమీ ఫైనల్ లో బీజేపీ హవా
– 3 రాష్ట్రాల్లో ఎగిరిన కాషాయ జెండా
– తెలంగాణలో పెరిగిన ఓట్ షేర్
– మరోసారి పని చేసిన మోడీ చరిష్మా
– సార్వత్రిక ఎన్నికల ముందు నయా జోష్
– ఫలితాలతో ఇండియా కూటమిలో కలవరం
– 6న ప్రత్యేక సమావేశం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. ఆదివారం 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించగా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో కాషాయ జెండా రెపరెపలాడింది. సార్వత్రిక లోక్ సభ ఎన్నికల ముందు ఈ విజయం కాషాయ దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటు కాంగ్రెస్ కేవలం తెలంగాణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు ప్రకటిస్తారు.
ఈ విజయంతో దేశంలో తమకు తిరుగు లేదని కమలనాథులు మరోసారి నిరూపించుకున్నారు. మధ్యప్రదేశ్ లో మరోసారి ప్రజల హృదయాలను గెల్చుకుని సర్కార్ ను ఏర్పాటు చేయబోతున్నారు. రాజస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాషాయ పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. ఇక సర్వేలను తారుమారు చేస్తూ ఛత్తీస్ గఢ్ లోనూ అత్యధిక స్థానాలను గెల్చుకున్నారు. కానీ, తెలంగాణలో వ్యూహాత్మక తప్పిదాల ఫలితంగా అధికారాన్ని అందుకోలేకపోయినా.. ఓట్ షేర్ మాత్రం పెంచుకున్నారు.
‘ఇండియా’ కూటమిపై ఎన్నికల ఫలితం
లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు విపక్ష ఇండియా కూటమిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. సీట్ల విషయంలో మొండిపట్టు పడుతోందని, స్నేహితులను కూడా పక్కకు పెడుతోందని మండిపడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తీరు కొనసాగితే ఇండియా కూటమికి భారీ ఎదురు దెబ్బ తప్పదని పలు పార్టీలు అంటున్నాయి. తాజా ఫలితాల నేపథ్యంలో 6న కూటమి సభ్యులు సమావేశం అవుతున్నారు.
మధ్యప్రదేశ్ పదిలం
మధ్యప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అత్యధిక స్థానాల్లో గెలిచి విజయకేతనాన్ని ఎగురవేసింది. ఇక్కడ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చరిష్మా బీజేపీకి బాగా ఉపయోగపడింది. దానికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మరింత బలాన్ని చేకూర్చింది. లాడ్లీ బహనా యోజనా వంటి పథకాలు, డబుల్ ఇంజన్ సర్కార్, హిందూత్వ, ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణం ఈ విజయాన్ని తెచ్చి పెట్టాయి. ఇక్కడ 163 స్థానాల్లో బీజేపీ గెలిచింది.
రాజస్థాన్ లో కమల వికాసం
రాజుల కోటలోనూ మోడీ చరిష్మాతో బీజేపీకి కలిసి వచ్చింది. ముఖ్యంగా ప్రచార సమయంలో గెహ్లాట్ సర్కార్ వైఫల్యాన్ని ప్రధాని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అటు రాజస్థాన్ కాంగ్రెస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి రెడ్ డైరీ వ్యాఖ్యలు కూడా హస్తం పార్టీని దెబ్బతీశాయి. ప్రతి ప్రచార ర్యాలీలో అమిత్ షా ఈ రెడ్ డైరీ ప్రస్తావన తీసుకువచ్చి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ 115 స్థానాలు దక్కించుకుంది.
ఛత్తీస్ గఢ్ లో అనూహ్య విజయం
ఛత్తీస్ గఢ్ లో బఘేల్ సర్కార్ మరోసారి అధికారం చేపడుతుందని సర్వేలు అంచనాలు వేశాయి. కానీ, అనూహ్యంగా అక్కడ బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ చరిష్మా బీజేపీకి మైలేజ్ పెంచింది. అటు లిక్కర్ పై నిషేధం హామీని అమలు చేయకపోవడం, ఆప్, స్వర ఆదివాసీ సమాజ్ పార్టీలు కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టడం వంటి అంశాలు హస్తాన్ని దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ బీజేపీకి 54 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 35 వచ్చాయి.