– అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ జోరు
– తుది దశలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
– మరి, బీజేపీ సంగతేంటి..?
– అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు?
– దరఖాస్తుల వడబోత ఎక్కడిదాకా వచ్చింది?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇంకోవైపు కాంగ్రెస్ (Congress) స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. మరి, బీజేపీ (BJP) సంగతేంటి..? అప్పుడెప్పుడో ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. కొందరు సీనియర్లు అయితే దరఖాస్తులు కూడా చేసుకోలేదు. ఇలాంటి కీలక సమయంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. అయితే.. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తెలంగాణలో 4 రైలు సర్వీసుల పొడిగింపును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోందని తెలిపారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ లో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని.. కొత్త మార్గాలను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని చెప్పారు.
ఇదే సమయంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించామని.. త్వరలో మరింత జోరందుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేకమంది బీజేపీలోకి చేరుతున్నట్లు చెప్పారు. ఈసారి ప్రజలు బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారని.. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు చాలామంది ప్రచారానికి రాబోతున్నారని వివరించారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపైనా మాట్లాడారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. తాము సిద్ధంగా ఉన్నామన్నారు కిషన్ రెడ్డి. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకు కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం అనేది.. తమ ఎన్నికల స్ట్రాటజీలో భాగమని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు కిషన్ రెడ్డి.