కర్ణాటక (Karnataka) రాజకీయం రాష్ట్ర రాజధానిని దాటి ఢిల్లీకి చేరుకుంది. కేంద్రంలోని బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ (Congress) నేతలు నిరసనకు దిగారు. అటు కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజధాని బెంగళూరులో బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. దీంతో ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
కర్ణాటకకు అందజేయాల్సిన నిధులను బీజేపీ సర్కార్ నిలిపేస్తోందని అధికార కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పన్ను రాబడిలో రాష్ట్రం వాటా తగ్గిందని అధికార ఆరోపణలు గుప్పించారు. పన్నుల రాబడిలో రాష్ట్రం వాటా 13 శాతం ఉండగా దాన్ని బీజేపీ 12 శాతానికి తగ్గించిందని చెబతూ జంతర్ మంతర్ వద్ద సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
గతేడాది ఎగువ భద్ర నీటి పారుదల ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.5 వేల 300 కోట్లు కేటాయించిందని సీఎం సిద్దరామయ్య తెలిపారు. కానీ అందులో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కర్ణాటకపై కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి వైఖరిని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా కేటాయించిన నిధులను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కన్నడిగుల ప్రయోజనాలు కాపాడటంలో తాము వెనకాడబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీలు కలిసిరావాల్సిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నేతల తీరుపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పన్నుల పంపిణీని తగ్గించడంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ తీరును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ మేరకు బెంగళూరులోని విధాన సౌధ వద్ద నేతలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది ఇలా వుంటే ఢిల్లీలో కాంగ్రెస్‌కు పోటీగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం యడియూరప్ప ఇతరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.