టికెట్ల విషయంలో తెలంగాణ బీజేపీ (BJP) అడుగులు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఓవైపు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల్ని ప్రకటించేసి దూసుకెళ్తుంటే.. బీజేపీ ఇప్పటిదాకా 53 సీట్లకు మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చేసింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. దీనికితోడు, కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరు నియోజకవర్గాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన శేరిలింగంపల్లి (Serilingampally) లో మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) ను కాదని పార్టీలో కొత్తగా చేరిన వారికి కొందరు సీనియర్లు వంత పాడుతుండడంపై కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ ఒకరు ట్వీట్ చేస్తూ… శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక నేత ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారని.. ఆయన విజయం కేక్ వాక్ లా ఉంటుందని అనడం కిందిస్థాయి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. అలాగే, బీజేపీలో ఉండాలా? వెళ్లాలా? అని ఊగిసలాడే మరో నేత ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయన అదే పోస్టులో.. మధ్యలో బీజేపీ లోకి వచ్చిన ఆ నేత చేసిన కార్యక్రమాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ ఈయనను పోటీ నుంచి విరమింప చేయటానికి లాబీయింగ్ చేస్తోందని అనడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కేంద్ర పార్టీ ఇంకా టికెట్ అనౌన్స్ చేయకముందే ఒక ఎంపీ, మరో సీనియర్ నేత శేరిలింగంపల్లిలో ఒక నాయకుడ్ని భుజాలపై మీద మోయడం చూస్తే ఇది పార్టీని ధిక్కరించడం కాదా? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నాయకత్వంపై వీరికున్న గౌరవం ఇదేనా అని అడుగుతున్నారు.
గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి స్థానం నుంచి గజ్జల యోగానంద్ పోటీ చేశారు. అప్పటినుంచి బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని నియోజకవర్గ కార్యకర్తలు చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఎంతో మంది పేద, మధ్య తరగతి వారికి అండగా నిలిచారని.. ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాటి పరిష్కారం కోసం కష్టపడుతున్నారని వివరిస్తున్నారు. అంతేకాదు, పార్టీ క్రమశిక్షణను తప్పకుండా పాటిస్తూ.. జనంలో మంచి పేరు సంపాదించుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో యోగానంద్ ను కాదని సీనియర్ నేతలు ఇలా మధ్యలో వచ్చినవారికి వంత పాడుతుండడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు కిందిస్థాయి లీడర్లు, కార్యకర్తలు.
పైగా ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దమనిషి ఒకరు.. ‘‘పార్టీకి కొన్నిసార్లు విద్యాధికుల కంటే కండబలం చూపించే వాళ్లు, దౌర్జన్యాలు చేసే వాళ్ళ అవసరం కూడా ఉంటుంది’ అంటూ ఇచ్చిన సమాధానం విని హతాశులవడం కార్యకర్తల వంతయింది.
శేరిలింగంపల్లితోపాటు అనేక నియోజకవర్గాల్లో కొన్నేళ్లుగా గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ఒళ్లు హూనం చేసుకుంటున్న వారిని కాదని.. తమ వర్గానికి చెందిన వారనో, ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి టికెట్లు ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై కమలం సాధారణ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. అనేక కష్టనష్టాలు కోర్చి ప్రాణాలు లెక్క చేయకుండా జెండా మోసినవారికి దక్కిన విలువ ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి వెళ్లే పెద్దలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోగతం తెలుసుకుంటేనే తెలంగాణలో బీజేపీకి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.