రాముడితో రాజకీయం సరికాదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinodkumar) అన్నారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రాచారం చేస్తున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
బీజేపీ, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) రాముడితో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా తానే గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తమను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నేతల సమీక్షలో గులాబీ బాస్ అధికారకంగా వినోద్ కుమార్ పేరును ప్రకటించారు. దీంతో మూడో సారి కరీంనగర్ నుండ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ బరిలో నిలువనున్నారు.
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ మరోసారి ఆయనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో ఆసక్తికరంగా మారింది.