– రాష్ట్ర నిధులపై కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగాం
– ఒక్క రూపాయి ఇచ్చింది లేదు
– విభజన హామీలను నెరవేర్చాలని కోరాం
– అమలు చేసింది లేదు
– రాష్ట్ర హక్కుల విషయంలో..
– కేంద్రం దగ్గర బీఆర్ఎస్ రాజీ పడింది లేదు
– మోడీ, రేవంత్ భేటీపై వినోద్ కుమార్ రియాక్షన్
తెలంగాణ వచ్చిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న నిధుల విషయంలో ప్రధాని మోడీని కేసీఆర్ చాలా సార్లు కలిశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కలిసిన ప్రతిసారి నిధుల గురించి చూస్తామని మోడీ అన్నారని చెప్పారు. కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కలవడాన్ని ఆయన స్వాగతించారు.
గతంలో విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిందన్నారు. కానీ, ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలనే మరోసారి కాంగ్రెస్ పార్టీ మోడీకి అందజేసిందని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన రహదారుల గురించి పార్లమెంట్ లో చాలా సార్లు మాట్లాడామని తెలిపారు. సైనిక్ స్కూల్ కోసం ఇప్పుడు మనం కొత్తగా అడగవల్సిన అవసరం లేదన్నారు వినోద్ కుమార్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదని.. ఇవాళ బీబీనగర్ లో ఎయిమ్స్ వచ్చిందంటే దానికి కారణం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
వరంగల్ లో భూ సేకరణ చేశామని.. ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వదని మొత్తం మీరే చూసుకోవాలని చెప్పిందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం ఎన్నడూ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ రాజీ పడలేదని తెలిపారు. కానీ, కాంగ్రెస్ మాత్రం నవోదయ విద్యాలయం కావాలని మోడీని అడగలేదన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో సైనిక్ స్కూల్ ను అడిగామని.. బుల్లెట్ ట్రైన్లు అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చారన్నారు.
హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగామని.. కాంగ్రెస్ మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. విభజన చట్టంలో చెప్పిన వాటికోసం ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. మోడీకి కేసీఆర్ వందల లేఖలు రాశారని, కానీ వాటిని ప్రధాని పట్టించుకోలేదని వివరించారు. అందుకే, తాము అప్పటి నుంచి ప్రధానిని కలువలేదన్నారు వినోద్.