నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations)కు రెడీ అవుతున్న వేళ ఓ వార్త ముంబై(Mumbai)కి వణుకు పుట్టిస్తోంది. ముంబై నగరాన్ని పేల్చి వేస్తామంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూంనకు ఫోన్ చేశాడు. నగరంలో పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చామని తెలిపాడు. అవి ఏ క్షణంలోనైనా పేలే అవకాశం ఉందంటూ వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. నగరంలో అనుమానస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించి వదిలి వేస్తున్నారు. నిందితుని వివరాలను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఫేక్ కాల్ అని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి పలు చోట్ల బాంబులు పెట్టామని చెప్పారని పోలీసులు వెల్లడించారు. కాల్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అంతకు ముందు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్టులోని ఓ విమానంలో బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు ఫోన్ లో వెల్లడించాడు.
దీనిపై ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. అదే రోజు జైపూర్ విమనాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. సీఆర్పీఎఫ్ పోలీసులు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో దాన్ని ఫేక్ కాల్ గా పోలీసులు తేల్చారు.